అశ్రునయనాల మధ్య ప్రత్తిపాటి మాతృమూర్తి అంతిమయాత్ర, అంత్యక్రియలు
*నారాయణమ్మ పార్థివదేహానికి ప్రజాప్రతినిధులు, అధికారుల ఘన నివాళులు*
మాజీమంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాతృమూర్తి నారాయణమ్మ అంత్యక్రియలు గురువారం ఉద్విగ్న వాతావరణంలో ముగిశాయి. అశ్రునయనాల మధ్య అంతిమయాత్ర నిర్వహించారు. చిలకలూరిపేటలోని నివాసం నుంచి గణపవరం ఎల్.సి.టి. కంపెనీ వరకు అంతిమయాత్ర సాగింది. నారాయణమ్మకు కడసారి వీడ్కోలు పలికేందుకు తెలుగుదేశం పార్టీతో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, ప్రజలు తరలివచ్చారు. తల్లి మృతదేహానికి చివరి స్నానం చేయించే సందర్భంలో భావోద్వేగానికి గురైన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కన్నీటిపర్యంతమయ్యారు. అనంతరం దారిపొడవునా ఆమె భౌతిక కాయంపై పుష్పాలుంచి నివాళులర్పించారు. ఎల్.సి.టి. కంపెనీ ప్రాంగణంలో కుమారుడు ప్రత్తిపాటి పుల్లారావు దహన సంస్కారాలు చేశారు. అంతిమయాత్రతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా నారాయణమ్మ పార్థివదేహానికి తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఘన నివాళులు అర్పించారు. భౌతికకాయంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, నరసరావుపేట, గురజాల, పెదకూరపాడు, గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేలు చదలవాడ అరవిందబాబు, యరపతినేని శ్రీనివాసరావు, భాష్యం ప్రవీణ్, నజీర్, గళ్లా మాధవి నివాళులర్పించారు. విజ్ఞాన్ విద్యా సంస్థల ఛైర్మన్ లావు రత్తయ్య, భాష్యం విద్యా సంస్థల అధినేత రామకృష్ణ, గుంటూరు మార్కెట్ యార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు, మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ, తదితరులు నారాయణమ్మ పార్థివదేహానికి నివాళులర్పించారు. పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, ఎస్పీ కంచి శ్రీనివాసరావు తదితరులు ప్రత్తిపాటి పుల్లారావును పరామర్శించి సంఘీభావం తెలిపారు.
0 comments:
Post a Comment