ముందస్తు సమాచారం ఇవ్వకుండా సమాధులు కూల్చడం వెనుక కుట్ర కోణం: మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి
పట్టణంలో జాతీయ రహదారి పక్కన ఉన్న దళిత, క్రైస్తవుల స్మశానవాటిక యందు పురపాలక సంఘం అధికారులు గురువారం ఉదయం ముందస్తుగా ఎటువంటి సమాచారం లేకుండా సమాధులను కూల్చిన ఘటన వెనుక దళితులపై, క్రైస్తవుల పై ఏవో అదృశ్యశక్తులు పన్నిన కుట్రగా భావిస్తున్నామని మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు పేర్కొన్నారు. సంఘ పెద్దలకు, సమాధులకు చెoదిన వారసులకు ముందుగా నోటీసులు అందిoచి, వారి అనుమతితో పెద్దల సమక్షంలో చేయాల్సిన అభివృద్ధి పనులను ఎవ్వరికి తెలియకుండా సమాధులను ఏకపక్షంగా కూలగొట్టడాన్ని ప్రత్తిపాటి తీవ్రంగా ఖండించారు. ప్రతి మతం వారు పవిత్రంగా భావించే స్మశాన ప్రాంగణాలను కాపాడవలసిన ప్రభుత్వమే కాంట్రాక్టర్లతో కూలగోట్టిoచడo, సదరు మతాలకు చెందిన వారి మనోభావాలను కించపరచడమేనని వారు తెలిపారు. రాష్ట్రంలో ఇటీవల కాలంలో సున్నితమైన నమ్మకాలతో ముడిపడిన మతపరమైన అంశాలలో, పలు వివాదాలు జరగడం దురదృష్టకరమని తెలిపారు. బాధ్యతాయుతమైన ప్రభుత్వ పదవులలో ఉన్నవారు సైతం మతాలను, నమ్మకాలను రెచ్చగొట్టేలా మాట్లాడటం మంచిది కాదని హితవు పలికారు. పట్టణంలో నిన్న జరిగిన సమాధుల విధ్వంసం ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో దళిత క్రైస్తవులకు న్యాయం జరగకుంటే, ప్రత్యక్ష పోరాటానికి కూడా తాను వెనుకంజ వేసేది లేదని హెచ్చరించారు.
0 comments:
Post a Comment