*15 రోజుల్లో చిలకలూరిపేట ప్రజలకు ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా తాగునీరు*
*ఎన్టీఆర్ సుజల పథకం, పాతచెరువు, కొత్తచెరువు పరిశీలించిన ప్రత్తిపాటి*
రాష్ట్రంలో గడిచిన అయిదేళ్లలో వైకాపా ప్రభుత్వం చేసిన పాపాలే తాగునీటి సరఫరా విషయంలో శాపాలై ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. కీలకమైన తాగునీటి ప్రాజెక్టులను పడకేయించడం, కనీసం నీటి నాణ్యత పరీక్షల్ని పట్టించుకోక పోవడం వల్లనే ఇప్పుడు సమస్యలు ఒక్కొక్కటే వెలుగులోకి వస్తున్నాయన్నారు. చిలకలూరిపేట పట్టణం ఎన్టీఆర్ సుజల పథకం, పట్టణానికి తాగునీరు అందించే పాత చెరువు, కొత్త చెరువును సోమవారం ఆయన పరిశీలించారు. చెరువుల్లో జలాలు రోజురోజుకు తగ్గుముఖం పడుతుండడం, ఉన్న అరా కొరా నీరు కాస్త రంగుమారి కలుషితంగా ఉండడంతో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం చెరువుల్లో ఉన్న నీరు 23 రోజుల లోపు అవసరాలకే సరిపోతాయని, అంతలోపు ప్రత్యామ్నాయాలు కూడా అన్వేషించాలన్నారు. తెలుగుదేశం గత ప్రభుత్వ హయాంలో సుమారు రూ.6 కోట్లతో నిర్మించిన ఎన్టీఆర్ సుజల పథకాన్ని వైసీపీ నిర్వీర్యం చేయడం వల్లనే ఇలాంటి దుస్థితి దాపురించిందని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు ప్రత్తిపాటి. చిలకలూరిపేటలో 25 అవుట్‌లెట్ పాయింట్లు పెట్టి పట్టణంలో పేదలకు రూ.2కే 20 లీటర్ల సురక్షిత నీటిని సరఫరా చేసే ప్లాంట్‌ను ఐదేళ్లుగా పాడుబెట్టారని మండిపడ్డారు. తెలుగుదేశం గత ప్రభుత్వంలోనే పనిచేయడం కూడా మొదలు పెట్టిన ప్లాంట్‌ను మూలన పడేయడం దారుణం కాదా అని ప్రశ్నించారు. ఆ ప్లాం ట్ దుస్థితి చూడలేక మధ్యలో రూ.20 లక్షలు పెట్టి మరమ్మతులు చేయించి వాడుకలోకి తెస్తామ న్నాఅడ్డుకున్నారని మండిపడ్డారు. అడ్డుకోవడమే కాక పోలీసుల దౌర్జన్యంతో పాటు తమ పార్టీ నాయకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని, ఆ కేసు ఇప్పటికీ ఉందన్నారు. నరసరావుపేట వెళ్లి బెయిల్ తెచ్చుకోవాల్సిన దుస్థితి ఆనాడు సృష్టించారన్నారు. అన్ని దుర్మార్గాలకు అవినీతి మంత్రి ఒడిగట్టారని అన్నారు. వైసీపీ ప్రభుత్వ తప్పిదాలు, వైఫల్యం కారణంగా చిలకలూరిపేట ప్రజలకు మరో 45 రోజులు నీటి కష్టాలు తప్పవని.. ఉన్నంతలో మెరుగైన నీటిని సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ప్లాంట్‌కు రూ.15 లక్షలతో మరమ్మతులు చేయించి 15 రోజుల్లో అందుబాటులోకి తెస్తామని రూ.2కే 20 లీటర్ల సురక్షితమైన మంచినీటిని అందిస్తామన్నారు ప్రత్తి పాటి. చెరువు నీటి విషయమై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, కార్యదర్శి సాయిప్రసాద్‌తో మాట్లాడామన్నారు. సాగర్ కుడికాల్వ ద్వారా 5 టీఎంసీలు విడుదల చేసి ముందు తాగునీటికి ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. చిలకలూరిపేట, వినుకొండతోపాటు నీటి కొరత ఉన్న ప్రాంతాలకు సరఫరా చేయాలని కోరామన్నారు. చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి అమృత్ పథకాన్ని పూర్తిచేస్తే చిలకలూరిపేటకు శాశ్వతంగా మంచినీటి సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉందన్నారు. నాటి అవినీతిమంత్రి విడదల రజ నీకి 6నెలల ముందు చెరువుకు నీళ్లు పెట్టడం కూడా చేతకాలేదన్నారు. నాటి అశ్రద్ధ, అలసత్వం కారణంగానే స్థానికులకు మంచినీళ్లు లేవు, పారిశుద్ధ్యం, చివరకు వీధిదీపాలు కూడా లేకుండా పోయాయన్నారు. మంత్రిగా ఉండి ఇంత ఘోరంగా వైఫల్యం చెందినటువంటి అసమర్ధపు అవినీతి మంత్రి అని ఎద్దేవా చేశారు. పారిపోయిన వారి గురించి మాట్లాడటం కూడా వృథా అని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగానే చంద్రబాబు మొదటి నెల రోజుల పాలన సూపర్ హిట్ అన్న ప్రత్తిపాటి మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగా అమలు చేస్తారన్నారు. ప్రతిపక్షాలు చెప్పినట్లు చెప్పిన మాటకు భిన్నంగా ఉండే అవకాశం లేదన్నారు. దశలవారీగా సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చడం జరుగుతుందన్నారు. చంద్రబాబు ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకుంటారని తెలిపారు. 11 స్థానాలకు పరిమితమైన వారిని శాశ్వతంగా కనుమరుగయ్యే విధంగా ఇచ్చిన మాట మీద నిలబడి అమలు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఉంటుందన్నారు.
0 comments:
Post a Comment