*నాదెండ్లలో వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న ప్రత్తిపాటి*
సర్వవిఘ్నాధిపతి అయిన వినాయకుడు ఆదిదేవుడితో పాటు యువతరానికి మంచి వ్యక్తిత్వ వికాస గురువు కూడా అన్నారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తి పాటి పుల్లారావు. ఆయన ఆహార్యం నుంచి మహిమల వరకు ఒక్కొక్క అంశం ఒక్కొక్క ప్రత్యేకతను సంతరించుకున్నాయని తెలిపారు. తల్లిదండ్రులు, గురువుల పట్ల గౌరవ మర్యాదలు ఎలా ఉండాలో చెప్పడమే కాదు... శరీరబలం కన్నా బుద్ధిబలం గొప్పదని చాటిన అద్భుతమూర్తి వినాయకుడన్నారు. నాదెండ్ల మండల కేంద్రంలోని వినాయక స్వామి ఆలయంలో చవితి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా శనివారం గణనాథుడి పూజల్లో స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు వేదాశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ ఆవరణలో భక్తులకు ప్రసాద వితరణను ప్రత్తిపాటి ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన ఆయన వినాయకుడి దర్శనం ఆనందదాయకం, ఆయనలోని ప్రతిపార్శ్వం ఒక వ్యక్తిత్వ వికాస పుస్తకం అన్నారు. మంచి సంతానంగా, మంచి విద్యార్థిగా, మంచి నాయకుడిగా, మంచి మనిషిగా ఉన్నతంగా ఎదగాలనే ప్రతిఒక్కరు అవన్నీ తప్పక తెలుసుకోవాలన్నారు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు.
0 comments:
Post a Comment