దండిమూడి బ్రిడ్జి వద్ద కోతకు గురైన ఓగేరు వాగును పరిశీలించిన ప్రత్తిపాటి
గడిచిన అయిదేళ్ల వైకాపా హయాం మొత్తం డ్రైన్ల వ్యవస్థను సర్వనాశనం చేశారని, ఆ దుష్పరిణామాలే ఇప్పుడు రాష్ట్రం ఎదుర్కోవాల్సి వస్తోందని ధ్వజమెత్తారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. ఆక్రమణలు, అవినీతికి తోడు జవాబుదారితనానికి సమాధి కట్టడంతోనే ఎక్కడికక్కడ గండ్లతో రైతులకు కడగండ్లు అని ఆవేదన వ్యక్తం చేశారాయన. వర్షాలు తగ్గిన తర్వాత వాగులు, డ్రెయిన్ల పరిస్థితిపై సమగ్ర అధ్యయనం చేశాకే వారు చేసిన నష్టం ఎంతో చెప్పడానికి సాధ్యమవుతుందని అన్నారు. చిలకలూరిపేట మండలం దండమూడి వద్ద కోతకు గురైన ఓగేరు వాగును ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పరిశీలించారు. ఈ సందర్బంగా భారీ వర్షాల కారణంగా వచ్చిన వరద ఉద్ధృతికి తమ పొలాలు కూడా కోతకు గురయ్యాయని ఆయన ఎదుట రైతులు వాపోయారు. వైసీపీ పాలనలో ఆ పార్టీ నాయకులు పెద్దఎత్తున ఓగేరు వాగును ఆక్రమించి పొలాలు సాగు చేస్తుకుంటున్నారని, ఆక్రమణల కారణంగా వాగు కుచించకుకుపోయిందని, దీంతో వరద ఉద్ధృతి పెరిగి పొలాల్లో ప్రవహిస్తున్నాయని రైతులు చెప్పారు. అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి వాగు లోపల పూడిక తొలగించి ప్రవాహానికి అడ్డులేకుండా కంపచెట్లు తొలగించి రెండు వైపులా కరకట్టలు పటిష్టంగా ఏర్పాటు చేస్తామన్నారు. త్వరితగతిన అంచనాలు రూపొందించి ఓగేరు వాగుకు మరమ్మతులు చేస్తామని హామీ ఇచ్చారు. వరదల వల్ల ప్రజలు ఇబ్బందులు పడటానికి, నష్టపోవడానికి, నీటమునగడానికి గత పాలకుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమన్నారు. వైకాపా ప్రభుత్వంలో వాగులను ఏవిధంగా ఆక్రమించారో ఓగేరు వాగును చూస్తేనే తెలుస్తుందన్నారు. విజయవాడను ముంచడానికి బుడమేరు ప్రధాన కారణమైతే చిలకలూరిపేటలో ఓగేరువాగు కింద ఉన్న రైతుల భూములు కూడా కొట్టుకుపోతున్నాయన్నారు. ఆక్రమణలతో రైతుల భూములు కోతకు గురయ్యాయని అన్నారు. ఆక్రమణలతో పాటు వాగులో ముళ్లపొదలు, చెట్లు, పూడికతీయకపోవడం, డ్రైన్లు శుభ్రం చేయకపోవడం, డ్రైనేజీ వ్యవస్థకు నిధులు కేటాయించకపోవడమేనని విమర్శించారు. వాగును ఆక్రమించి వైసీపీ నాయకులు పొలాలు సాగు చేస్తున్నారన్నారు ప్రత్తిపాటి. ఫలితంగానే జగన్‌రెడ్డి ఐదేళ్ల పాలనలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందన్నారు. సాగర్ కాల్వలు సహా అన్నీ నిర్లక్ష్యానికి గురికావడం వల్లనే రాష్ట్రంలో చిన్నపాటి వర్షానికి కూడా నీటమునిగే పరిస్థితి ఏర్పడిందన్నారు. గత ఐదేళ్లు రాష్ట్రంలో ఈ రకమైన దందాలే జరిగాయన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గండ్లుపూడ్చడం, వరద సహాయ చర్యలకు రాష్ట్రప్రభుత్వం వద్ద నిధుల్లేని పరిస్థితుల్లో కేంద్రం పెద్దమనసుతో సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. డ్రైనేజీ వ్యవస్థ, కాల్వలను మెరుగుపరచడానికి కేంద్రం నిధులు కేటాయిస్తే తప్ప ఈ సంక్షోభం నుంచి బయటపడలేమన్నారు. కోతకు గురైన ఓగేరు వాగు మరమ్మతులకు అంచనాలు రూపొందించి త్వరితగితన పనులు చేపడతామన్నారు. ఓగేరు, కుప్పగంజి వాగులను ఆధునికీకరిస్తే తప్ప రైతులు ఈ నష్టం నుంచి బయటపడే అవకాశం లేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ తీసుకుని చిలకలూరిపేట సహా రాష్ట్రం మొత్తం డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని, ఎంత వర్షం కురిసినా నష్టం జరగకుండా నివారణ చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్తామని, ఈ ఐదేళ్లలో డ్రైనేజీ వ్యవస్థపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం కూటమి ప్రభుత్వంపై ఉందన్నారు.
0 comments:
Post a Comment