*ఈవూరివారిపాలెంలో విజయోత్సవ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ప్రత్తిపాటి*
రాష్ట్రానికి పట్టిన ఐదేళ్ల వైకాపా గ్రహణం పోయి ప్రజాప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో వేలాదిమంది టిడ్కో గృహాల లబ్ధిదారులకు త్వరలోనే మంచిరోజులు రానున్నాయన్నారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేపట్టిన 3 లక్షలకు పైగా టిడ్కో ఇళ్లలో లక్షన్నర 2019కే 90శాతం వరకు పూర్తయినా మిగిలిన చిన్నచిన్న పనులు కూడా పూర్తిచేయకుండా ఆ లబ్ధిదారులను క్షోభపెట్టిన దుర్మార్గుడు జగన్ అని దుయ్యబట్టారాయన. అంతేగాక అధికారంలోకి రాగానే ఏకంగా 51వేల ఇళ్ల కేటాయింపులు కూడా రద్దు చేసి కక్ష సాధింపులకు పాల్పడ్డారని... ఆ తప్పులన్నింటినీ ఇప్పుడు సరి చేయాల్సిన సమయం వచ్చిందన్నారు ప్రత్తిపాటి. సోమవారం రాత్రి చిలకలూరిపేట మండలం ఈవూరివారిపాలెంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో విజయోత్సవ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆ కార్యక్రమంలో స్థానిక ప్రజలంతా పూలవర్షం కురిపించి నీరాజనాలు పట్టారు. నాయకులు, అభిమానులు శాలువాలు, పూల మాలలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రత్తిపాటి చిలకలూరిపేట చరిత్రలో ఎన్నడూలేనంత మెజార్టీ ఇచ్చి తనను గెలిపించిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. తనకు తిరుగులేని విజయాన్ని అందించిన చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలకు అన్నివిధాలా అండగా ఉంటానన్నారు. ఐదేళ్లుగా కష్టపడిన కార్యకర్తలకు పార్టీ పరంగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. చంద్రబాబు సహకారంతో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుతో కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని భరోసా ఇచ్చారు. మరీ ముఖ్యంగా నియోజకవర్గ పరిధిలో చివరి దశలో ఆగి పోయిన టిడ్కో ఇళ్లు మొత్తం పూర్తి చేస్తామని, అన్నివసతులతో వాటిని లబ్దిదారులకు అందిస్తామని స్పష్టం చేశారు. రానున్న అయిదేళ్లు కూడా పట్టణ, గ్రామీణ రెండు ప్రాంతాల్లో గృహనిర్మాణ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు ప్రత్తిపాటి పుల్లారావు.
0 comments:
Post a Comment