*మున్సిపల్, పౌరసరఫరాల శాఖల అధికారులతో ప్రత్తిపాటి సమీక్ష*
పౌర సేవలు, అభివృద్ధిలో ప్రజాపాలన ముద్ర కనిపించాలన్నారు మాజీమంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. ఆ దిశగా తక్షణం కార్యచరణ ప్రారంభించ్చాలని అధికారులకు సూచించారు. తాగునీరు, పారిశుద్యంపై అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వర్షాకాలం నేపథ్యంలో ఈ విషయంలో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. కలుషిత నీరు, అపరిశుభ్ర పరిసరాల వల్ల తలెత్తే అనారోగ్య సమస్యలపై అన్ని విధాలుగా నివారణ చర్యలు చేపట్టాలన్నారు. మంగళవారం చిలకలూరిపేట క్యాంపు కార్యాలయంలో మున్సిపల్, పౌరసరఫరాల శాఖ అధికారులతో ప్రత్తిపాటి సమీక్షించారు. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి తెలుసుకున్నారు. పెండింగ్ పనుల పురోగతిని తెలుసుకుని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. మున్సిపాలిటీ పరిధిలోని ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అభివృద్ధే లక్ష్యంగా పనిచేద్దామని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ రాష్ట్రంలో చీకటి పాలన అంతమైందని... ఇక అభివృద్ధే లక్ష్యంగా తమ పాలన సాగుతుందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రారంభమై.. మధ్యలోనే ఆగిపోయిన ప్రాజెక్టులకు కూడా మోక్షం లభిస్తుందన్నారు. ప్రభుత్వ సహకారంతో ఇకపై చిలకలూరిపేట అభివృద్ధి పథంలో పయనిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని సమస్యలను అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏమిటో? అధికారులుగా మీ సలహాలు, సూచనలు చెబితే తదుపరి చర్యలు తీసుకుంటానని చెప్పారు. పట్టణంలో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించాలని పేర్కొన్నారు. టిడ్కో గృహ సముదాయంలో మౌలిక వసతుల కల్పనతో పాటు అక్కడికి వెళ్లే రహదారిని బాగు చేయాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న టిడ్కో గృహాలను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అతి త్వరలోనే చిలకలూరిపేటలో అన్న క్యాంటీన్లు ప్రారంభించి నిరుపేదలకు రూ.5కే మంచి భోజనం అందిస్తామని తెలిపారు. అన్న క్యాంటీన్ భవనాలకు మరమ్మతులు చేసి పూర్తిస్థాయిలో శుభ్రం చేయించాలని పురపాలక అధికారులను ఆదేశించారు. రేషన్ పంపిణీపై పౌరసరఫరాల శాఖ డీటీతో చర్చించారు. అగ్నిమాపక శాఖ అధికారులతో పాటు పలు ప్రభుత్వ శాఖల అధికారులు ప్రత్తిపాటిని మర్యాదపూర్వకంగా కలిశారు. తమను పరిచయం చేసుకుని శాఖల గురించి వివరించారు.
0 comments:
Post a Comment