*తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రత్తిపాటి పుల్లారావు*
ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షల ఫలమే నూతనంగా కొలువుదీరిన ప్రజా ప్రభుత్వం అన్నారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు. ఈ ప్రభుత్వాన్ని ఈ ఐదేళ్లే కాదు ఆపై రానున్న పదేళ్లు కూడా జగన్ సహా ఏ దుష్టశక్తి ఇంచు కూడా కదల్చలేదన్నారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధి ఆకాంక్షను నెరవేర్చాలన్న చంద్రబాబు, పవన్, లోకేష్ సంకల్పం, నాయకత్వాలే ఈ రాష్ట్రానికి శ్రీరామరక్షగా ఉంటాయన్నారు. ఆదివారం వీఐపీ బ్రేక్ సమయంలో ప్రత్తిపాటి పుల్లారావు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సతీమణి వెంకటకుమారి, కుమార్తె స్వాతి, తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ఆయన స్వామివారి దర్శనం చేసుకున్నారు. దర్శనానంతరం వేద పండితులు ప్రత్తిపాటి దంపతులను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ఐదు కోట్ల ప్రజల ఆకాంక్షల మేరకు అభివృద్ధి, సంక్షేమం జరగాలని, అమరావతి, పోలవరం నిర్మాణాలు పూర్తి కావాలన్నారు. ప్రజాపాలన అందించాలని రాష్ట్ర ప్రజలు కోరుకున్నట్లుగానే ఈ నెల 12న ప్రమాణస్వీకారం జరిగినప్పటి నుంచి మార్పు చూస్తున్నారన్నారు. జగన్‌రెడ్డి ఐదేళ్ల పాలనలో ప్రజలు విసిగి వేసారి పోయారన్నారు. స్వాతంత్ర్యం వచ్చాక ఎప్పుడూ రానటువంటి మెజార్టీలు అనేక నియోజకవర్గాల్లో వచ్చాయని, 93 శాతం సీట్లు కూటమి గెలవడం చరిత్రలో ఇదే తొలిసారి అని అభిప్రాయపడ్డారు. ఈ విధమైన ఫలితాలు రావడానికి కారణం ఐదేళ్ల పాలనపై ప్రజలు విసిగి వేసారిపోవడమేనని, జగన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాలకు ప్రజామోదం లేకపోవడమే వల్లే ప్రజలు ఈ రకమైన తీర్పును ఇచ్చారన్నారు. ప్రజలు కోరుకున్న విధంగా ప్రజాపాలన అందించకపోతే ఏవిధమైన తీర్పు ఇస్తారో అనేదానికి 2024 ఎన్నికలే నిదర్శనమని అన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చకపోతే ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారు అనేదానికి ఇటీవలి ఎన్నికల ఫలితాలే నిదర్శనమని.. జగన్‌రెడ్డి పాలన చూసిన తర్వాత ఆంధ్రులు స్పష్టమైన తీర్పునిచ్చారన్నారు.
0 comments:
Post a Comment