*రోటరీ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శుల ప్రమాణస్వీకారంలో పాల్గొన్న ప్రత్తిపాటి*
ఎంత సంపాదించినా ప్రజాసేవతో ప్రజలను ఆదుకోవడంలో ఉన్న తృప్తిని మించింది ఏమీ లేదన్నారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు ప్రత్తిపాటి పుల్లారావు. మిగిలిన వారితో పోల్చుకుంటే ఇతరులకు సాయం చేసే వారిలో ఉండే ఆనందమే వేరన్నారు. గురువారం రోటరీ క్లబ్ ఆఫ్ పండరీపురం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమం చిలకలూరిపేటలోని గ్రాండ్ వెంకటేశ్ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించారు. 2024-25 సంవత్సరానికి గాను రోటరీ క్లబ్ అధ్యక్షునిగా శరత్‌కుమార్ శాస్త్రి, కార్యదర్శిగా కొల్లా వెంకటసుబ్బారావు, కోశాధికారిగా జంపని శ్రీనివాసరావు పదవీ ప్రమాణాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యుడిగా ముఖ్య అతిథిగా హాజరైన ప్రత్తిపాటి పుల్లారావు వారికి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. విద్యార్థులకు బ్యాగులు, పుస్తకాలు, దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ సమాజంలో మనల్ని ప్రత్యేకంగా నిలబెట్టేవి సేవా కార్యక్రమాలే అన్నారు. రాజకీయంగా కావచ్చు, రోటరీ క్లబ్ ద్వారా కావచ్చు, లయన్స్ క్లబ్ ద్వారా కావచ్చు ఆర్థికంగా స్థిరపడిన వారు.. ఆర్థికంగా వెనుకబడిన సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. రోటరీ క్లబ్ తరఫున చిలకలూరిపేటలో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని.. వారందరిని అభినందిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పేద కుటుంబాల నుంచి, వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చేటువంటి పేదలకు ఎంత చేసినా కూడా తక్కువేనని అన్నారు. ఆర్థికంగా స్థిరపడిన వారితో పాటు ఆర్థికంగా ఎదుగుతున్న వారంతా నిండు మనసుతో ముందుకొచ్చి చేయూత ఇస్తే అంతకు మించిన ఆత్మ సంతృప్తి మరొకటి లేదన్నారు. దాతల సహకారంతో పేదలు, విద్యార్థులకు ఉపయోగపడేలా రోటరీ క్లబ్ తరఫున మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. అలానే రాష్ట్రంలో అరాచక పాలకుడుని సాగనంపిన ప్రజల తీర్పుతో ఒక మంచి ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ఇన్నేళ్ల ప్రజాస్వామ్య భారతంలో ఇలాంటి తీర్పును ఎప్పుడూ ఇవ్వలేదన్నారు. చేతగాని సీఎం వస్తే ఏ విధమైన తీర్పును ఇచ్చారో ప్రజల తీర్పును బట్టి అర్థమవుతుందన్నారు. చిలకలూరిపేట సహా రాష్ట్రంలో అనేక నియోజకవర్గాల్లో ఇంత మెజార్టీలు ఎప్పుడూ చూడలేదన్నారు. గత పాలకుల వైఫల్యం, అరాచకాలు, తప్పిదాలు, స్వేచ్ఛను హరిస్తే ఎలాంటి తీర్పు ఇస్తారో ఇటీవలి ఎన్నికలే నిదర్శన మన్నారు ప్రత్తిపాటి. రాష్ట్రానికి డబ్బులు లేకపోయినా మంచి పరిపాలన దక్షుడు వచ్చారన్నారు. అప్పులపాలైన రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమంలో ముందుకు తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు కష్టపడుతున్నారని కొనియాడారు ప్రత్తిపాటి పుల్లారావు.
0 comments:
Post a Comment