ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఐ ముందుండి పోరాడుతుందని ఆ పార్టీ ఏరియా ఇన్‌చార్జి కార్యదర్శి నాగబైరు రామ సుబ్బాయమ్మ చెప్పారు. శనివారం సీపీఐ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలసి విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 4వతేదీ నరసరావుపేటలోని సీపీఐ కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సమావేశం, 5వతేదీ ఉదయం జనరల్ బాడీ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశాల్లో పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్‌కుమార్, కెవీవీ ప్రసాద్‌లతో పాటు జిల్లా కార్యదర్శి మారుతీ వరప్రసాద్ హాజరౌతారన్నారు. 5న నిర్వహించే జనరల్ బాడీ సమావేశానికి గ్రామ స్థాయి నుంచి కార్యకర్తలు, అభిమానులు, వివిధ విభాగాల్లో ఉండే నాయకులు హాజరు కావాలని కోరారు.
హామీలు అమలు జరపాలి...
దేశంలో మోడీ నాయకత్వంలోని బిజెపి అనుసరించిన మతోన్మాద చర్యలను, కార్పొరేట్ శక్తులకు, దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలను పరిశ్రమలను కారుచౌకగా కట్టపెట్టే విధానాలను ప్రజలు తిరస్కరించారని తెలిపారు. రాష్ట్రంలో పెరుగుతున్న ధరలను, మౌలిక సదుపాయ కల్పనను, అమరావతి రాజధాని విద్రోహం, ఏపికి ప్రత్యేక తరగతి హోదా సాధించుటలో విభజన హామీల అమలు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి రాష్ట్ర ప్రగతికి ఏ మాత్రం చర్యలు తీసుకొనని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించారని వెల్లడించారు. . దాని స్థానంలో అధికారంలో వచ్చిన టీడీపీ న్యాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సూపర్ 6 గ్యారెంటీల అమలు జరపాలని, అలా జరగని పక్షంలో భవిష్యత్తులో ప్రజలు తగి గుణపాఠం నేర్పుతారన్నారు. సమావేశంలో సీపీఐ పట్టణ కార్యదర్శి పేలూరి రామారావు, ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి మేకపోతుల నాగేశ్వరరావు, నాయకులు నాయుడు శివకుమార్, బొంతా భగత్‌సింగ్, పాతపట్నం గోపి తదితరులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment