- ప్రజలు సమస్యను నా దృష్టికి తీసుకొచ్చేవరకు నిర్లక్ష్యంగానే ఉంటారా?
- చెరువులోని నీరు సకాలంలో ప్రజలకు అందించకపోతే ప్రభుత్వానికి ఎంత చెడ్డపేరో ఆలోచించరా?
- ఏ వార్డుల్లో నీళ్లు రాలేదని ఫిర్యాదులొస్తే, ఆ ప్రాంత సిబ్బందిని ఇంటికి పంపడం ఖాయం : ప్రత్తిపాటి
- తాగునీటి సమస్యలపై మున్సిపల్, ఆర్.డబ్ల్యూ.ఎస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రత్తిపాటి
ప్రజలకు సకాలంలో తాగునీరు అందించలేనప్పుడు ఎవరైనా, ఎంతటివారైనా సహించేది లేదని, తాగునీటి సమస్యపై ప్రజలు నాకు ఫిర్యాదుచేసేవరకు మున్సిపల్ సిబ్బంది, ఆర్.డబ్ల్యూ.ఎస్ అధికారులు స్పందించకపోవడాన్ని ఏమనాలని, తీరు మార్చుకోకుంటే బాధ్యులైన వారిని ఇంటికి పంపడం తప్ప మరోమార్గం లేదని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టంచేశారు. ప్రజల నుంచి వస్తున్న తాగునీటి ఫిర్యాదులపై స్పందించిన మాజీమంత్రి స్థానిక మున్సిపల్, ఆర్.డబ్ల్యూ.ఎస్ అధికారులతో మున్సిపల్ కార్యాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ప్రజలు సమస్యను తన దృష్టికి తీసుకొచ్చేవరకు అధికారులు, నీటిసరఫరా విభాగం సిబ్బంది నిర్లక్ష్యంగా ఉండడాన్ని ప్రత్తిపాటి తప్పుపట్టారు. కూటమిప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలనే దురుద్దేశంతో పనిచేసేవారిని సస్పెండ్ చేసి, సాగనంపడం తప్ప మరోమార్గం లేదని ప్రత్తిపాటి తేల్చిచెప్పారు.
*ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోరా... నాకు ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంటే ఎవరైనా ఉపేక్షించేది లేదు*
కూటమిప్రభుత్వంలో ప్రజలకు తాగునీరు అందకపోవడం ఏమిటని, చెరువులో పుష్కలంగా నీరున్నా, ప్రజలకు అందకపోవడం ఎవరి తప్పిదమని ప్రత్తిపాటి సిబ్బందిని ప్రశ్నించారు. ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోకుంటే ఎందుకు భరించాలన్నా ఆయన, ఉద్దేశపూర్వకంగా నాకు, ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చేవారు ఎంతటివారైనా ఇక ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు. కిందిస్థాయి సిబ్బంది మొదలు పైస్థాయి వరకు అందరూ కఠిన చర్యలకు గురికాక తప్పదన్నారు. మీరు చేసే తప్పులవల్ల ప్రజల్లో మాకు చెడ్డపేరు రావాలా ..అలా చేసేవారిని చూస్తూ వదిలేయాలా అని ప్రత్తిపాటి ఆగ్రహం వ్యక్తంచేశారు. నీటిసరఫరాలో మీలో మీకు ఏమైనా సమన్వయ లోపాలుంటే పరిష్కరించుకోవాలి గానీ, ప్రజల్ని ఇబ్బంది పెడతారా అని ప్రత్తిపాటి అసహనం వ్యక్తంచేశారు. గత ప్రభుత్వంలో వ్యవహరించినట్టుగానే ఈ ప్రభుత్వంలో కూడా పనిచేస్తామంటే కుదరదని, ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు న్యాయం చేయలేనివారితో మాకు అవసరంలేదని ప్రత్తిపాటి స్పష్టం చేశారు. అర్థరాత్రి అపరాత్రి అని కూడా లేకుండా సమస్య తెలిసిన వెంటనే సిబ్బంది స్పందించాలని, వేసవిలో ఏవార్డులోనూ, ఏ గ్రామంలోనూ తాగునీరు అందలేదనే మాటే వినిపించకూడదని మాజీమంత్రి ఆదేశించారు. పైపుల ద్వారా నీరుఇవ్వడం వీలుకాకుంటే ట్యాంకర్లద్వారా అయినా నీటిసరఫరా జరగాలన్నారు. పట్టణవ్యాప్తంగా జరుగుతున్న తాగునీటి పైపుల లింకేజీ (అమరిక) పనుల్లో జరిగే జాప్యాన్ని నివారించాలని, సదరు గుత్తేదారు సంస్థ ప్రతినిధులతో మాట్లాడి, పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని ప్రత్తిపాటి మున్సిపల్ కమిషనర్ని ఆదేశించారు. ప్రజలు బాధల్ని ఎక్కువకాలం భరించరని, ఎంత పేరుమోసిన సంస్థ అయినా సకాలంలో పనులు పూర్తిచేయనప్పుడు ఎందుకు భరించాలని ప్రత్తిపాటి స్పష్టంచేశారు. తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతాలైన పండరీపురం, మద్దినగర్, వెంగళరెడ్డి నగర్, 10వ వార్డు, 38వ వార్డులపై ప్రత్యేక దృష్టిపెట్టాలని, తాగునీటి వృథాను అరికట్టి, ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించాలని ప్రత్తిపాటి సూచించారు. సమస్యలు పరిష్కరించారో లేదో తెలుసుకోవడానికి తానే స్వయంగా వార్డుల్లోకి వెళ్లి ప్రజలు అభిప్రాయాలు తీసుకుంటానని చెప్పారు.
మంత్రి ఆదేశాలపై స్పందించిన ఆర్.డబ్ల్యూ.ఎస్ ఈ.ఈ, ఇతర సిబ్బంది పైపుల లింకేజీ పనులు వారంలో పూర్తయ్యేలా చూస్తామని, సమస్య పరిష్కారానికి అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు.
అత్యవసర సమావేశంలో మున్సిపల్ కమిషనర్ పతి శ్రీహరి, డి.ఈ రహీం, ఆర్.డబ్ల్యూ.ఎస్ అధికారులు, జనసేన ఇంచార్జి తోట రాజారమేష్, బీజేపీ నాయకులు జయరామిరెడ్డి, టీడీపీ నాయకులు గంగా శ్రీనివాసరావు, మున్సిపల్ కౌన్సిలర్లు, కూటమినాయకులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment