- బీసీ, ఈబీసీ మహిళల స్వయం ఉపాధి శిక్షణా కార్యక్రమంలో ప్రత్తిపాటి
- గృహిణులకోసం త్వరలోనే ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం తీసుకురానుంది : ప్రత్తిపాటి
ఆడబిడ్డలు ఇంటికే కాకుండా సమాజానికి కూడా వెలుగులు పంచాలంటే, స్వశక్తితో రాణించాలని అప్పుడే రాష్ట్రప్రగతిలో వారు కీలక భాగస్వాములు కాగలరని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. రాష్ట్ర బీసీ కార్పొరేషన్, ఈ.డబ్ల్యూ.ఎస్ కార్పొరేషన్ సహాకారంతో యడ్లపాడులో ప్రారంభమైన ఉచిత కుట్టుమిషన్ శిక్షణా తరగతుల్ని మంగళవారం ప్రత్తిపాటి ప్రారంభించారు. శిక్షణా తరగతులకు వచ్చిన మహిళలతో మాట్లాడిన ప్రత్తిపాటి, వారి కుటుంబాల స్థితిగతులు తెలుసుకొని జీవన ప్రమాణాలు పెంపునకు పలు సూచనలు చేశారు. టైలరింగ్ తో పాటు, అనుబంధ పనుల్ని నేర్చుకొని, కుట్టుపనిలో బాగా రాణించాలని, మీకు మీరు ఉపాధి పొందడమే గాక, చుట్టూఉండేవారికి ఉపాధి కల్పించే స్థాయికి వెళ్లాలని ప్రత్తిపాటి తెలిపారు. పేద కుటుంబాలను వృద్ధిలోకి తీసుకురావడం కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు P-4 విధానాన్ని తీసుకొచ్చారన్నారు. రాష్ట్రంలో పేదరికం లేకుండా ధృఢనిశ్చయంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గృహిణులు తమకు ఆసక్తిఉన్న అంశంలో శిక్షణ పొంది, తమలోని ప్రతిభతో కుటుంబాలను బాగుచేసుకోవాలని ప్రత్తిపాటి సూచించారు. ఆ దిశగా ఆలోచించే మహిళల కోసమే ప్రత్యేకంగా ప్రభుత్వం త్వరలోనే వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని తీసుకురానుందని ప్రత్తిపాటి చెప్పారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు కామినేని సాయిబాబు, రాఘవరావు, పోపూరి రామారావు, వెంకట రత్తయ్య, కుర్ర రత్తయ్య, తోకల రాజేష్, నక్కా పోతురాజు, అంజేశ్వరరావు, అనితా భాయి, ఎంపీడీవో అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment